రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ అంకిత్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (Community Health Centre) జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది హాజరును పరిశీలించడంతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ రోజు విడిచి రోజు విధులకు హాజరవుతున్నట్లు గమనించిన కలెక్టర్.. వెంటనే డీసీహెచ్‌ఎస్‌కు ఫోన్ చేసి, గైనకాలజిస్ట్ ప్రతిరోజూ అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణులు, మహిళా రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

​అనంతరం రక్త పరీక్షల కేంద్రాన్ని, ఇన్‌పేషెంట్ వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం సిబ్బంది బాధ్యతని, అత్యవసర వైద్య సేవలకు ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. ​

ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, వార్డులు, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆవరణలో విద్యుత్ వైర్లు బయటకు వచ్చి ఉండటాన్ని గుర్తించి, ప్రమాదాలు జరగకుండా వెంటనే భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే ఇన్‌పేషెంట్లకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి, నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని వంట మనిషిని ఆదేశించారు.

​ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటాన్ని గమనించి, నిర్మాణాన్ని వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ తనిఖీలో సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారి, వైద్యులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>