కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ముజఫర్‌నగర్ జిల్లాలోని షామ్లీ హైవేపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు కారులో హరిద్వార్‌కు బయలుదేరారు.
ప్రయాణం సజావుగా సాగుతున్న సమయంలో మార్గమధ్యంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారంతటా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. హిసార్ నుంచి హరిద్వార్‌కు వెళ్లే క్రమంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

