కలం, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్‌ను (Nagarjuna Sagar) శనివారం 14 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు ( Foreign Delegates) సందర్శించారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గత కొన్ని రోజులుగా స్టాటప్ కంపెనీలకు చెందిన విదేశీ ప్రతినిధులు శిక్షణ పొందుతున్నారు. వీరిలో బంగ్లాదేశ్, ఈజిప్ట్, జింబాబ్వే, మాల్దీవులు, నైజీరియా, మార్సిస్, ఇరాన్, సిరియా,తాన్జానియా మొదలగు 14 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు ఉన్నారు. సాగర్ సందర్శనలో భాగంగా నాగార్జునసాగర్‌కి చేరుకున్న ఈ బృందానికి రెవెన్యూ ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు.
అనంతరం వీరు బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధవనం విశేషాలు తెలియజేసే లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం మహస్తూపం ధ్యాన మందిరంలో వీరిచే బుద్దవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన ధ్యానం చేయించారు. అనంతరం వీరు నాగార్జునకొండ మ్యూజియాన్ని, నాగార్జునసాగర్ డ్యామ్‌ను సందర్శించారు. వీరికి నాగార్జునసాగర్ డ్యాం వివరాలను, నాగార్జునకొండ, బుద్ధవనం విశేషాలను స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ వివరించారు. వీరితోపాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ స్టడీ టూర్ విజిట్ ఇంచార్జ్ మహమ్మద్ సయ్యద్ ఫయాజ్ తదితరులు ఉన్నారు.

