కలం, ఖమ్మం బ్యూరో : ముర్రేడు వాగు (Murredu Vagu) వరద ముప్పునకు శాశ్వత పరిష్కారంగా రిటైనింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆదేశించారు. ముర్రేడు వాగుపై రక్షణ గోడ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 50.50 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో, శనివారం ఆయన సంబంధిత శాఖ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి వాగు పరివాహక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు.
శ్రీనగర్, ప్రశాంతి నగర్, సాయినగర్ తదితర ముంపునకు గురయ్యే లోతట్టు కాలనీలను, వాగు పరిసరాలను ప్రత్యక్షంగా పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. గత పాలకులు ఈ దీర్ఘకాలిక సమస్యను పూర్తిగా విస్మరించడంతో ఏళ్ల తరబడి భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చివరికి శ్మశాన వాటికలకు వెళ్లే మార్గాలు సైతం మునిగిపోయి నానా తంటాలు పడాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించి, ముంపు సమస్యకు రక్షణ గోడ నిర్మాణమే ఏకైక పరిష్కారమని భావించి మూడేళ్లుగా నిరంతరం పట్టుబట్టి రూ. 50.50 కోట్ల నిధులను రాబట్టామని వివరించారు.
ఎస్టిమేషన్ల ప్రకారం పనుల్లో ఎలాంటి రాజీ పడకుండా, పటిష్టమైన సాంకేతిక ప్రమాణాలతో రక్షణ గోడ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ పనులకు శ్రీకారం చుట్టి వరద బాధితులకు భయాల నుంచి పూర్తి విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి రాజీలేని రీతిలో నిరంతరం శ్రమిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట నాయకులు నేరెళ్ళ రమేష్, లగడపాటి రమేష్, చౌదరి, మిరియాల రాము, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

