అనాథ బాలికకు అండగా నిలిచిన కేటీఆర్.. కృతజ్ఞతగా పాట రాసిన రుద్ర రచన

కలం, వెబ్ డెస్క్: కష్టకాలంలో తన చదువుకు అండగా నిలిచి జీవితానికి బాటలు వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) కు కృతజ్ఞతలు తెలియజేస్తూ జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన రుద్ర రచన (Rudra Rachana) ఓ ప్రత్యేక పాటను రాసింది. ‘మనసున్న మారాజు కేటీఆర్ అన్న’ పేరుతో రూపొందించిన ఈ పాటను కేటీఆర్ ఈరోజు ఆవిష్కరించారు.

తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన రచనకు చదువుకోవాలనే బలమైన ఆకాంక్ష ఉండేది. అయితే ఆర్థిక పరిస్థితులు ఆమె విద్యకు ఆటంకంగా మారాయి. ఈ విషయం 2019లో కొందరు నెటిజన్లు ట్విటర్ వేదికగా అప్పటి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్, రచన చదువుకు అవసరమైన ఇంజినీరింగ్ ఫీజులతో పాటు హాస్టల్ ఖర్చులను కూడా స్వయంగా భరించేందుకు ముందుకొచ్చారు.

ఆయన అందించిన సహకారంతో రచన తన ఇంజినీరింగ్ విద్యను విజయవంతంగా పూర్తి చేసింది. అంతేకాకుండా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ప్రతిభ చాటుకుని నాలుగు ప్రముఖ ఐటీ కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలను సైతం అందుకుంది. చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం సాధించిన అనంతరం రచన కేటీఆర్‌ను స్వయంగా కలిసి తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ సమయంలో ఆయనకు రాఖీ కట్టి తన ఆత్మీయతను చాటుకుంది.

తన జీవితంలో వెలుగులు నింపిన కేటీఆర్ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని భావించిన రచన, ఆయనపై అభిమానంతో ‘మనసున్న మారాజు కేటీఆర్ అన్న’ పాటను రచించింది. ఈ పాటను కేటీఆర్ ఆవిష్కరించడంతో రచన ఆనందం వ్యక్తం చేసింది. ఆపదలో ఉన్న విద్యార్థినికి అండగా నిలిచిన సహాయాన్ని గుర్తుచేస్తూ ఈ పాట రూపొందడం విశేషంగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>