ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై టీఎస్‌యూటీఎఫ్‌ ఆగ్రహం

​కలం, బోనకల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉండవని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రకటించారని, కానీ నేడు ఆచరణలో సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని టీఎస్‌యూటీఎఫ్‌ ( Khammam TSUTF) ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ విమర్శించారు. మధిర మండలం రావినూతల గ్రామంలో శుక్రవారం జరిగిన టీఎస్‌యూటీఎఫ్‌ 11వ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంఘం మండల అధ్యక్షుడు గార్లపాటి చిన్న రంగారావు అధ్యక్షత వహించిన ఈ సభలో తొలుత సీనియర్ నాయకురాలు దాచేపల్లి అరుణకుమారి సంఘం జెండా ఆవిష్కరించగా, పి. గోపాల్ రావు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

​ఈ సందర్భంగా షేక్ రంజాన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలైన సీపీఎస్ (CPS) రద్దు, పెండింగ్ బిల్లులు డీఏల (DAs) సాధన కోసం ప్రభుత్వంపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పోరాటాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉపాధ్యాయులను నమ్మించే ప్రయత్నం చేయగా, సంఘం రాష్ట్ర అధ్యక్షులు చావా రవి వాటిని తిప్పికొట్టారన్నారు. ప్రభుత్వం ఒకే డీఏ ఇస్తామన్న సందర్భంలో టీఎస్‌యూటీఎఫ్‌ సమావేశాన్ని బహిష్కరించి, ఒత్తిడి తెచ్చి రెండు డీఏలు సాధించుకున్న ఘనత మన సంఘానిదేనని తెలిపారు.

​సమావేశంలో వక్తలందరూ నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ (PDF) అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొల్లి సత్యనారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, జిల్లా కార్యదర్శులు అనుమల కోటేశ్వరరావు, షేక్ నాగూర్ వలి, మధిర ప్రాంతీయ కార్యదర్శి వినోద్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ రామకృష్ణ, మాజీ నాయకులు నీలం లక్ష్మీనారాయణ, పి. నాగరత్నం, రైతు సంఘం నాయకులు కిలారు సురేష్, ఉపాధ్యక్షులు బి. సౌభాగ్య లక్ష్మి, పి. గోపాల్ రావు, కోశాధికారి పి. నరసింహారావు, మండల ఆడిటర్ ఎం. నరేంద్రసింహ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>