కలం, సినిమా: త్వరలో మరో టాలీవుడ్ హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తన చిరకాల ప్రేయసి, స్నేహితురాలు కిరణ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరి నిశ్చితార్థ వేడుక గురువారం హైదరాబాద్‌లోని హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందిన సభ్యులంతా ఈ వేడుకకు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్, విజయదుర్గ, సోదరుడు వైష్ణవ్ తేజ్‌తో పాటు చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు బాబీ, నీలా షా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నాగబాబు, పద్మజ, నిహారిక కొణిదెల, అల్లు అరవింద్, అల్లు నిర్మల, అల్లు శిరీష్, నయనికా రెడ్డి ఈ వేడుకలో సందడి చేశారు.అలాగే మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి, నవీన్ విజయకృష్ణ, హర్ష చెముడు, వెంకీ కుడుముల, నవదీప్, హర్షిత్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు, సన్నిహితులు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ జంట వివాహ వేడుక మరో ఐదు రోజుల్లో డిసెంబర్ 10న హైదరాబాద్‌లో జరగనుంది.

