కలం, ఖమ్మం బ్యూరో: సూర్యుడు అస్తమించి లోకమంతా చీకట్లో నిద్రపోతున్న వేళ.. ప్రకృతి మాత్రం ప్రళయ రూపాన్ని దాల్చింది. ఉప్పొంగుతున్న వరద నీరు మృత్యువులా ముంచుకొస్తున్న భయానక పరిస్థితుల్లో ఎవరైనా ప్రాణభయంతో వెనక్కి తగ్గుతారు. కానీ, ‘తోటి మనిషి ప్రాణం ప్రమాదంలో ఉంది’ అనే ఆలోచనతో రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి సాహసించారు. మృత్యువుతో పోరాడి, చిమ్మచీకటిని చీల్చుకుంటూ వారు చేసిన సాహసం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి (Bethupalli) చెరువు వద్ద చోటుచేసుకున్న ఈ ఉత్కంఠభరిత ఘటన అంకితభావానికి నిలువెత్తు రూపంగా నిలిచింది.
ఉప్పొంగిన వరద.. ఉత్కంఠ రేపిన దృశ్యాలు
మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా బేతుపల్లి పెద్ద చెరువు ఉప్పొంగింది. దమ్మపేట మండలంలోనూ మల్లెపూల వాగు, ముసలిబంధం చెరువుల వద్ద గండ్లు పడి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న 8 మంది మత్స్యకారులను కాపాడేందుకు రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ బృందం పడవకు ప్రమాదం జరగడంతో మత్స్యకారులతో పాటు రెస్క్యూ సిబ్బంది కూడా వరద ఉధృతిలో చిక్కుకున్నారు. కమ్మేస్తున్న చిమ్మచీకటి, ఉప్పొంగుతున్న నీటి ప్రవాహం మధ్య రాత్రంతా సాగిన ఈ ఆపరేషన్ క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తించింది.
వెనకడుగు వేయని తెగువ.. ప్రాణాలను పణంగా పెట్టిన వైనం!
కష్టకాలంలో ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోని ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి అవిశ్రాంతంగా శ్రమించారు. ఎక్కడా వెనకడుగు వేయకుండా అంకితభావంతో వ్యవహరించి, గల్లంతైన 10 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఒక స్థానిక వ్యక్తి, ఐదుగురు జాలర్లతో సహా మొత్తం 16 మందిని క్షేమంగా ఒడ్డుకు చేర్చి ప్రాణదాతలుగా నిలిచారు.
ప్రభుత్వం అభినందనలు.. ఘన సన్మానం!
ఈ సాహస యోధుల తెగువను సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అభినందించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్‌కుమార్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, ఖమ్మం కలెక్టర్ దివాకర్ టీ.ఎస్.తో కలిసి స్వయంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రంతా జాగారం చేసి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ప్రతిభ చాటిన రెస్క్యూ సిబ్బందిని ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రతి ఒక్కరినీ భుజం తట్టి జిల్లా పేరు నిలబెట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా తుమ్మల ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆలింగనం చేసుకోవడం అక్కడున్న వారిని సైతం భావోద్వేగానికి గురిచేసింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పార్టీ యంత్రాంగం అందించిన సహకారాన్ని నాయకులు ప్రత్యేకంగా కొనియాడారు.
ప్రభుత్వ భరోసా.. ఇందిరమ్మ ఇళ్లు, స్థలాలు మంజూరు!
ప్రాణాలను తృణప్రాయంగా భావించి తోటివారిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. విధుల్లో నిబద్ధత చాటుకున్న సిబ్బందిలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లతో పాటు స్థలాలు కూడా వెంటనే మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్‌ను ఆదేశించారు. ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు భయంతో పారిపోవడం సహజం. కానీ ఆ భయాన్నే జయించి, ప్రాణాలను పణంగా పెట్టి తోటివారిని రక్షించడం దేవుడిచ్చిన వరం లాంటిదే. బేతుపల్లి చెరువు నీటి అలల తాకిడికి ఆనవాళ్లు చెరిగిపోవచ్చు. కానీ, ఆ చీకటి రాత్రి ఆపద్బాంధవులై నిలిచిన రెస్క్యూ హీరోల సాహసగాథ మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కర్తవ్యానికి నిలువెత్తు రూపమైన వీరు మన సమాజానికి నిజమైన స్ఫూర్తి ప్రదాతలు.

