కరీంనగర్ హాకీ అసోసియేషన్.. పదేళ్లుగా పదవులు వారికేనా?

కలం, కరీంనగర్: క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్‌ (Karimnagar Hockey Association)లో పదవులే పరమావధిగా మారాయా? అనే చర్చ నడుస్తోంది. నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితికి మాత్రమే పరిమితం కావాల్సిన పదవుల్లో కొందరు ఏళ్ల తరబడి కొనసాగడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మారుమారుగా కీలక బాధ్యతలు చేపడుతున్నారనే ఫిర్యాదులు అధికారుల దృష్టికి చేరాయి. ఫలితంగా జిల్లాలో హాకీ క్రీడ అభివృద్ధి కుంటుపడుతోందని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ (రిజిస్ట్రేషన్ నంబర్ 46/2016)లో గత పదేళ్లుగా కార్యదర్శి పదవి సర్దార్ సురేందర్ సింగ్ లేదా ఆయన భార్య చేతుల్లోనే ఉంటోందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సర్దార్ సురేందర్ సింగ్ కార్యదర్శిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ నిబంధనల ప్రకారం నాలుగేళ్లు లేదా ఒక టర్మ్ మాత్రమే పదవిలో ఉండాల్సి ఉండగా, పదేళ్లుగా అదే వ్యక్తులు పదవుల్లో కొనసాగడం ఏ నిబంధనల ప్రకారం సమర్థనీయమని ప్రశ్నిస్తున్నారు.

స్థానికంగా ఉండకుండానే బాధ్యతలా?

కార్యదర్శిగా కొనసాగుతున్న సురేందర్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగి అని, కరీంనగర్ జిల్లాలో కాకుండా హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో నివసిస్తూ ప్యాట్నీ ఎస్‌బీఐ బ్రాంచిలో విధులు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లాలో అందుబాటులో ఉండాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ స్థానికంగా లేకపోవడం వల్ల హాకీ క్రీడా కార్యకలాపాల నిర్వహణపై ప్రభావం పడుతోందని ఆరోపించారు.

కొత్త కార్యవర్గానికి అవకాశం ఏదీ?

అసోసియేషన్‌లో ఒకే సామాజిక వర్గానికి చెందినవారు మూడింట రెండొంతుల మంది ఉండేలా వ్యవస్థ కొనసాగుతోందని, దీంతో కొత్తవారికి ప్రాతినిధ్యం లభించడం లేదని ఫిర్యాదుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదవుల మార్పు, ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు లేకపోవడంతో జిల్లా హాకీ అభివృద్ధి నిలిచిపోయిందని, క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో హాకీ క్రీడ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కలెక్టర్ జోక్యం చేసుకోవాలి

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రస్తుత పాలకవర్గాన్ని రద్దు చేయాలని, అసోసియేషన్ రిజిస్ట్రేషన్‌పై కూడా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా యువజన క్రీడల అధికారి (డీవైఎస్‌ఓ), ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)లకు సమర్పించిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>