కేబినెట్ భేటీ.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ల విభజనపై కీలక నిర్ణయం!

కలం, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet Meeting) సెక్రటేరియెట్ లో గురువారం జరగనున్నది. పలు విభాగాల నుంచి ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు రాగా వాటిపై సమీక్ష నిర్వహించిన సీఎస్.. ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేశారు. ఇప్పటివరకు సుమారు 15 కీలక అంశాలతో ఎజెండా రూపొందగా మరికొన్ని టేబుల్ ఎజెండా ఐటెమ్స్ గా కేబినెట్ సమావేశానికి చర్చకు రానున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.

ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉన్నందున దాన్ని విభజించి ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేసేలా ప్రస్తుత చట్టానికి సవరణలకు ఒక ఆర్డినెన్స్ జారీ చేయడంపై కేబినెట్ భేటీలో చర్చ జరగనున్నది. పలు దళిత, ఆదివాసీ, గిరిజన సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించే అవకాశమున్నది. గత, ప్రస్తుత ప్రభుత్వంలో కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడడంతో అవి సమర్థవంతంగా పనిచేసేలా దాదాపు 800 కొత్త పోస్టుల్ని క్రియేట్ చేయడంపైనా ఈ కేబినెట్ భేటీ చర్చించవచ్చని తెలిసింది.

ఎల్‌ నినో అంశాలపై సమగ్ర చర్చ

రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌ నినో పరిస్థితులు, హైదరాబాద్ నగరంలో తాగునీటికి ఏర్పడిన చిక్కులు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పలు మండలాల్లో తీవ్రమైన కరువు, రైతులకు జరిగిన పంట నష్టం, పశుగ్రాస కేంద్రాలు.. ఇలాంటి అన్ని అంశాలపై కేబినెట్ చర్చించనున్నది. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఇకపైన చేపట్టాల్సిన అంశాలపై చర్చించడంతో పాటు ఢిల్లీకి ఆల్-పార్టీ డెలిగేషన్‌ను తీసుకెళ్లి కేంద్ర హోంమంత్రితో చర్చించడంపైనా మంత్రివర్గ సమావేశంలో తేదీ ఖరారయ్యే అవకాశమున్నది.

కేంద్రం నుంచి ఆర్థిక సాయంతో పాటు పలు రకాలుగా వెసులుబాటును కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా స్పందన లేకపోవడం, కేంద్రం నుంచి కరువు అధ్యయన బృందాలు రాష్ట్రానికి వచ్చి పర్యటించడంపై స్పష్టత లేకేపోవడంపైనా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశమున్నది. హైదరాబాద్ నగరానికి ఏర్పడనున్న తాగునీటి సమస్య, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. వీటిపై మంత్రివర్గ సమావేశం లోతుగా చర్చించనున్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి.

ఇన్‌ఫార్మల్ మీటింగ్‌లో గ్లోబల్ సమ్మిట్‌పై రివ్యూ

రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముందు ఒక గంట పాటు ‘ఇన్‌ఫార్మల్ కేబినెట్ మీటింగ్’ జరగనున్నది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ కంపెనీలతో కుదిరిన అవగాహనా ఒప్పందాలు, అందులో మెటీరియలైజ్ అయినవి, ప్రోగ్రెస్‌లో ఉన్నవి, లేటెస్ట్ స్టేటస్‌పై సీఎం చర్చించనున్నారు. ఏయే కారణాలతో ఎలాంటి జాప్యం జరుగుతున్నదో సీఎం రేవంత్ ఆరా తీసి వచ్చే నెలలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రిస్టీజియస్‌‌గా తీసుకున్నందున ఏర్పాట్లు, లోపాల్లేకుండా నిర్వహించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయనున్నట్లు ఆ వర్గాల సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>