కలం, నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గ రాజకీయాల్లోకి మరో యువ వ్యాపారవేత్త అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన నల్ల వినయ్ రెడ్డి (Nalla Vinay Reddy) గురువారం బీఆర్ఎస్‌లో చేరనున్నారు. హైదరాబాద్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆయన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాజకీయ నేపథ్యమున్న కుటుంబానికి చెందిన వినయ్ రెడ్డి కొంతకాలంగా నిర్మల్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. స్థానికంగా సన్నిహితులు, వివిధ పార్టీల నాయకులతో సమావేశమవుతూ గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతోనే ఆయన రాజకీయ అరంగేట్రానికి సిద్ధమైనట్లు అనుచర వర్గంలో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు కేటీఆర్‌ను కలిసి తన రాజకీయ ఆసక్తిని వెల్లడించినట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం నుంచి సానుకూల సంకేతాలు రావడంతోనే చేరికకు రంగం సిద్ధమైనట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే పార్టీ టికెట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. యువ వ్యాపారవేత్తగా గుర్తింపు ఉన్న వినయ్ రెడ్డి రాజకీయాల్లోకి రావడం నిర్మల్ నియోజకవర్గంలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఆయన చేరిక బీఆర్ఎస్ రాజకీయాలకు ఏ మేరకు ఊతమిస్తుందో, రానున్న రోజుల్లో నియోజకవర్గ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

