కలం, మెదక్ బ్యూరో: ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి వెళ్తున్న రైతును (Farmer)గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ గ్రామానికి చెందిన రైతు తిరుపతి కిషన్ (65) తన వరి పంటను కోసి ధాన్యాన్ని విక్రయించేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. ఔరంగాబాద్ గేట్ వద్ద పంచముఖి హనుమాన్ దేవాలయం సమీపంలో రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు ఆయనను బలంగా ఢీకొట్టి పరారైంది.
ఈ ప్రమాదంలో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవడం, కనీస విద్యుత్ సదుపాయం కూడా లేకపోవడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటన స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా హాస్పటల్‌కు తరలించారు.

