కలం, కరీంనగర్: ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు కొమ్ముల కుమార్ (Kommula Kumar) ఆరోపించారు. కరీంనగర్ (Karimnagar)లోని కిసాన్‌నగర్ లో రోడ్డు నిర్మాణం పేరుతో ఇళ్ల యజమానులను ఇబ్బందులకు గురిచేస్తూ, ఇళ్లు కూల్చకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని స్థానిక కార్పొరేటర్ డిమాండ్ చేస్తున్నారని బోయినపల్లి స్వరూప, కొమురవ్వ ఆరోపించారు. బుధవారం నగరంలోని నక్షత్ర హోటల్లో కొమ్ముల కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా కొమ్ముల కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఇతరులపై అవినీతి ఆరోపణలు చేసే ముందు తమ వ్యవహారాలను పరిశీలించుకోవాలని హితవు పలికారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ వంటి నాయకులపై విమర్శలు చేసే స్థాయి, అర్హత స్థానిక బీజేపీ నాయకులకు లేదన్నారు.
కిసాన్‌నగర్ (Kisan Nagar)లో గాంధీ చౌరస్తా నుంచి రైల్వే కట్ట వరకు ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని ఆరోపించారు. సుమారు 15 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు అనుమతుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ, ఇళ్లు కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకుంటున్న వారి నుంచి సైతం రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఇళ్లు కూల్చకుండా ఉండాలంటే డబ్బులివ్వాల్సిందేనా? అని ప్రశ్నించారు. ఇటీవల ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటి నిర్మాణం విషయంలోనూ డబ్బుల కోసం ఒత్తిడి తెచ్చారని అన్నారు.
చిరు వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, టీ దుకాణాలు నిర్వహించుకునే వారిని సైతం వేధిస్తున్నారని కుమార్ ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసుల పేరుతోనూ వ్యాపారులపై ఒత్తిడి తెస్తూ, నెలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చిన్న వ్యాపారులు భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలను, వ్యాపారులను బెదిరిస్తూ పాలన సాగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
బీజేపీ నాయకులు తమపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించాలని, తాము ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని కుమార్ సవాల్ విసిరారు. అవసరమైతే వినాయకుడి ఆలయంలోనైనా, హనుమాన్ ఆలయంలోనైనా ప్రమాణం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ నాయకులు కూడా ముందుకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ప్రజలను బెదిరిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో దరిపెల్లి క్రాంతి కుమార్, నక్క శేఖర్, కల్లెపల్లి నవీన్‌కుమార్, గూగులోతు శ్రీకాంత్, కందుకూరి శివకుమార్, కొమ్ముల సాయికృష్ణ, ఎండీ నయీమ్, లునావత్ శేఖర్, టేకుల అభి, కోమల శివసాయి, దీకొండ శివకృష్ణ, మాతంగి సుమిత్, బోయినపల్లి స్వరూప, కొమురవ్వ, గాలి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

