కలం, వెబ్ డెస్క్ : సదర్ పండుగ అనేది కేవలం యాదవులకు మాత్రమే పరిమితమైన వేడుక కాదని, అది తెలంగాణ ఆత్మగౌరవానికి, రాష్ట్ర గుర్తింపునకు ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం’ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. యాదవుల చరిత్ర ఎంతో ఘనమైనదని, హైదరాబాద్ నగర అభివృద్ధిలో, అలాగే చారిత్రాత్మక గోల్కొండ కోట నిర్మాణంలో యాదవుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదర్ ఉత్సవాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందని తెలిపారు. అయితే గత ప్రభుత్వం ఈ పండుగ విశిష్టతను ఎందుకు గుర్తించాలేదని ప్రశ్నించారు. సదర్ అంటే కేవలం జల్సా మాత్రమే కాదని, హైదరాబాద్ సంస్కృతికి అద్దం పట్టే వేడుక అని పేర్కొన్నారు. ఆర్బీఐ దగ్గర డబ్బు బంద్ అయినా కావచ్చు ఏమో కానీ, కష్టపడే మనస్తత్వం ఉన్న యాదవుల దగ్గర ధనానికి ఎప్పుడూ కొదువ ఉండదని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురు యాదవ ప్రముఖులు, నాయకులు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

