కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డిలో వినూత్న నిరసనల ద్వారా సమస్యలపై తన గళం వినిపిస్తున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ (Councillor Geriganti Laxminarayana). వర్షాకాలంలో వరద నీరు నడి రోడ్డుపై నిలిచిపోయి వాహనదారులకు ఇబ్బంది అవుతుంటే అదే వరద నీళ్ళల్లో కూర్చుని నిరసన తెలిపిన ఆయన ఈసారి చెత్తలో (Garbage) కూర్చున్నారు. కామారెడ్డి పాత పట్టణాన్ని అలాగే ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ అధికారులు చెత్త డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని 47 వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని చూపిస్తూ వినూత్న నిరసన తెలిపారు. పారిశుధ్య కార్మికులతో రాత్రి వేళల్లో కాకుండా షిఫ్ట్‌ల వారీగా కొత్త పద్ధతిలో మున్సిపల్ కమిషనర్ పని చేయిస్తున్నారని దాని వల్ల ఉదయం 11 గంటల వరకు కూడా రోడ్లు శుభ్రం కావడం లేదని విమర్శించారు. కమిషనర్ తీరుతో శుభ్రత కరువైందని ఆవేదన చెందారు. ఈ ప్రభావం పాత పట్టణ పరిసరాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంపై పడుతుందని అన్నారు.
చెత్త వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయని ఇదేం పద్దతి అని ప్రశ్నించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో ఎలా ఉండాలని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే ఈ పద్ధతిని మార్చి పాత పద్ధతిలోనే పారిశుధ్య నిర్వహణ పనులు చేయించాలని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

