‘మురసు’ తుఫాన్ బీభత్సం.. జలదిగ్బంధంలో మూడు మండలాలు!

కలం, దమ్మ పేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) నియోజకవర్గంలో మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. గత 36 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ​

ములకలపల్లి మండలం రాజుపేట వద్ద పాములేరు వాగుపై ఇటీవల బ్రిడ్జి కూలిపోవడంతో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి.. వాగు ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో పాల్వంచ–దమ్మపేట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 14,195 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అధికారులు 3 గేట్లను ఎత్తి 14,145 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

​అశ్వారావుపేట మండలం వాగొడ్డుగూడెం వద్ద వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు ఆ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాళ్లపాయి, గోగులబంధం ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దమ్మపేట మండలం గండుగులపల్లిలో మల్లెపూల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బాలరాజుగూడెం, మొద్దులగూడెం, లచ్చాపురం తదితర గిరిజన గ్రామాల పరిధిలో చెరువులు నిండి పొంగిపొర్లుతుండటంతో పంట పొలాలు నీటమునిగాయి. మూడు మండల కేంద్రాల్లోని పలు నివాస ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

​ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పంటలు నీట మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరి, పొగాకు, మినుము పంటలు దెబ్బతినడంతో భారీ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తుఫాన్ ప్రభావం రానున్న గంటల్లోనూ కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, వంకలు దాటే సాహసం చేయవద్దని స్పష్టం చేశారు. స్థానిక యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>