ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ బంద్.. కండక్టర్ ప్రవళిక మృతితో కార్మికుల ఆగ్రహం!

కలం, ఖమ్మం బ్యూరో: “నిత్యం వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే మా ప్రాణాలకే రక్షణ లేదా?.. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల(TGSRTC Employees)పై దాడులు చేస్తూ పొట్టనబెట్టుకోవడం ఎంతవరకు సమంజసం?” అంటూ కార్మిక లోకం గళమెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక దుర్మరణం ఉమ్మడి ఖమ్మం (Khammam) రీజియన్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. టికెట్ విషయంలో ప్రయాణికురాలు జరిపిన అనాగరిక దాడికి ఓ నిండు ప్రాణం బలికావడంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి.

​గత నెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న TGSRTC బస్సులో ప్రయాణికురాలు బానోతు మౌనికకు, కండక్టర్ ప్రవళికకు మధ్య చిల్లర విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అశ్వాపురం మండలం మిట్టగూడెం సెంటర్ వద్ద ప్రయాణికురాలు మౌనిక.. కండక్టర్ ప్రవళికను బస్సులో నుంచి కిందకు తోసేసింది. ఈ ప్రమాదంలో కింద పడిన ప్రవళిక కాళ్లపై నుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. మొదట భద్రాచలం ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రికి తరలించారు. గత పది రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రవళిక, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రిని సందర్శించి మెరుగైన వైద్యం అందించినా ఆమెను కాపాడుకోలేకపోయినట్లు వెల్లడించారు. తండ్రి మరణంతో కేవలం ఆరు నెలల క్రితమే కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ప్రవళిక, అనతికాలంలోనే ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం తరఫున ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించినట్లు తెలుస్తుంది.

​కండక్టర్ ప్రవళిక (Conductor Pravalika) మృతికి తీవ్ర నిరసనగా, విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల(TGSRTC Employees)కు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం రీజియన్ JAC పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఖమ్మం రీజియన్ పరిధిలోని అన్ని డిపోలలో బుధవారం ఉదయం మొదటి డ్యూటీ నుంచే ఉద్యోగులు విధులను బహిష్కరించి బస్సులను డిపోలకే పరిమితం చేశారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం మణుగూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు పెద్దఎత్తున బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రవళిక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

బంద్‌ కారణంగా బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మణుగూరు డిపో వద్ద సీఐ నాగబాబు, ఎస్సై నగేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ​”ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని మరింత కఠినతరం చేయాలి… ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన ప్రవళిక ఆత్మకు శాంతి చేకూరేలా ఆమె కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి” అని కార్మిక సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Also Read : కాంట్రవర్సీ కాంగ్రెస్.. నేతల లొల్లితో పీసీసీకి తలనొప్పి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>