చిల్లర డబ్బుల గొడవ.. చికిత్స పొందుతూ కండక్టర్ మృతి

కలం, వెబ్ డెస్క్​: చిల్లర డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రయాణికురాలు బస్సు నుంచి తోసేసిన ఘటనలో చికిత్స పొందుతూ మహిళా కండక్టర్ మరణించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపో మహిళా కండక్టర్​ గుండ్ల ప్రవళిక (30) (Manuguru Bus Conductor Pravalika ) పదిరోజుల క్రితం విధుల నిర్వహణలో గాయపడింది.

అశ్వాపురు మండలం మిట్టగూడెం ప్రాంతంలో బస్సులో టికెట్​ కు సంబంధించి చిల్లర విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో ప్రయాణికురాలు.. ప్రవళికను బస్సు నుంచి కిందకు తోసేయడంతో బస్సు చక్రాలు ఆమె కాళ్లపై నుంచి వెళ్లాయి. తీవ్ర గాయాలైన కండక్టర్​ ను తోటి సిబ్బంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​ లోని సాయి సంజీవని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రవళిక మంగళవారం రాత్రి మృతి చెందింది.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం

మహిళా కండక్టర్ (Manuguru Bus Conductor) మృతి చెందడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం స్పందించారు. ఆమె మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఇటీవల ప్రయాణికులతో జరిగిన వివాదంలో తీవ్రంగా గాయపడిన కండక్టర్​ ప్రవళికకు హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాం. ఆమె ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకొని తిరిగి విధుల్లో చేరుతారని ఆశించాను. కానీ మృతి చెందడం అత్యంత బాధాకరం” అని పొన్నం ప్రభాకర్​ ఎక్స్​ వేదికగా సంతాపం ప్రకటించారు. కండక్టర్​ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మృతురాలు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ అన్ని విధాలా అండగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>