ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీ ఎన్నికల బరిలో మను భాకర్

కలం, స్పోర్ట్స్ : ఒలింపిక్స్‌లో పతకాలతో మెరిసిన మను భాకర్ (Manu Bhaker).. ఇప్పుడు షూటర్ల గొంతుకగా మారేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) అథ్లెట్ల కమిటీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. 2026-2030 పదవీకాలానికి పిస్టల్ విభాగం నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఈ విభాగంలో రెండు స్థానాల కోసం మొత్తం పది మంది పోటీ పడుతున్నారు. షూటర్ల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని మను తెలిపింది.

పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌కు ఒలింపిక్స్‌లో కొనసాగింపు కల్పించడం ఆమె ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటి. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లలో ప్రైజ్‌మనీ పెంచాలని కూడా కోరుతోంది. ఒలింపిక్ సైకిల్స్ మధ్య సాంకేతిక నిబంధనల్లో స్థిరత్వం ఉండాలని భావిస్తోంది. షూటర్ల సమస్యలను నేరుగా తెలియజేసేందుకు రహస్యంగా ఫిర్యాదులు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మను ప్రతిపాదించింది. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, స్పోర్ట్స్ సైకాలజీ కార్యక్రమాలు, ప్రత్యేక ప్రశాంత వాతావరణం కల్పించాలని కోరుతోంది.

సోషల్ మీడియా ద్వారా షూటింగ్ క్రీడను మరింత మందికి చేరువ చేయాలని కూడా భావిస్తోంది. ఆట ముగిసిన తర్వాత క్రీడాకారులకు ఆర్థిక భద్రత, ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంపైనా దృష్టి పెట్టనుంది. నవంబర్ 3 నుంచి 13 వరకు దోహాలో జరిగే ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల సమయంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో షూటర్లకు ప్రాతినిధ్యం వహించే దిశగా అడుగులు వేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>