కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు: విజయ్ భాస్కర్

కలం, హనుమకొండ: గత 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏనాడూ పదవులను ఆశించలేదని, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా ఉన్నానని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ (Dasyam Vijay Bhaskar) అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (Naini Rajender Reddy)ని హెచ్చరించారు.

వడ్డేపల్లిలోని తన నివాసంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గంలో ఇతర పార్టీల నాయకులు రాజకీయంగా విమర్శలు చేసినప్పటికీ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా ఉంటున్నారని, అయితే కొందరు తెరవెనుక ఉండి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తన కుటుంబ సభ్యులు మంత్రిగా, చీఫ్‌విప్‌గా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేసినా తానెప్పుడూ అధికార దర్పంతో వ్యవహరించలేదని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో బీరు బాటిల్ తాగి, దానిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోకి విసిరేయించిన ఘటన తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలు చిల్లర రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. అధికారం ఉందని కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే.. గతంలో తాము నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసిన పనులను ప్రారంభించడమే అభివృద్ధిగా చెప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. తాము చేసిన అభివృద్ధి, ప్రస్తుత పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

రాజకీయాల్లో తన అనుభవం ఏమిటో తన మామ, కాంగ్రెస్ నాయకులు నాయిని రాజేందర్‌రెడ్డిని అడిగితే చెబుతారని వ్యాఖ్యానించారు. ఇకనైనా వ్యవహారశైలి మార్చుకోవాలని, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తల జోలికి వస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని విజయ్ భాస్కర్ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>