కలం, తెలంగాణ బ్యూరో: రెండు పెండింగ్ డీఏల సమస్య ఒక రకంగా కొలిక్కి వచ్చినా తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేేఏసీ (Telangana Employees JAC)లో మాత్రం మరికొన్ని అంశాలపై ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తే కొనసాగుతున్నది. చీఫ్ సెక్రటరీ హామీ ఇచ్చినట్లుగా పీఆర్సీ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వానికి చేరకపోవడంతో ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో పెన్షనర్లలో ఆందోళన నెలకొన్నది. నిర్దిష్ట గడువులోగా రిపోర్టు తెప్పించుకుంటామని చీఫ్ సెక్రటరీ చెప్పడమే కాకుండా పీఆర్సీ ఛైర్మన్‌కు లేఖ కూడా రాశారు.
నెలలు గడుస్తున్నా దానిపై స్పష్టత లేకపోవడంతో తదుపరి కార్యాచరణపై జేఏసీ కసరత్తు మొదలుపెట్టింది. దీనితో పాటు మరో మూడు కీలక డిమాండ్లు, అదనంగా కొన్ని అంశాలను చేర్చి చర్చించడంపైనా ఈ నెల 6న తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్లో జేఏసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నది. జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (ఈసీ మెంబర్లు), అన్ని జిల్లాల అధ్యక్షులు, కన్వీనర్లు, జేఏసీలోని వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరుక వాల్సిందిగా జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మంగళవారం ఒక సర్క్యులర్‌లో తెలియజేశారు.
కీలక డిమాండ్లకు పరిష్కారం లేకపోవడంతో…
రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా పీఆర్సీ నివేదిక ఇప్పటికీ రెడీ కాకపోవడాన్ని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటూ జేఏసీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాయి. ప్రతి నెలా ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల మూల వేతనం (బేసిక్ పే) నుంచి హెల్త్ స్కీమ్ కోసం 1.5 శాతం చొప్పున ప్రభుత్వం కత్తిరిస్తున్నా ఆ స్కీమ్ ఆచరణలో మాత్రం పకడ్బందీగా అమలు కావడంలేదన్న ఆందోళనను సంఘాలు వ్యక్తం చేశాయి. తరచూ ప్రభుత్వానికి (హెల్త్ కేర్ ట్రస్ట్) ఫిర్యాదు చేస్తూ ఉన్నాయి.
ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, అధికార కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నప్పుడే డిమాండ్లను సాధించుకోవాలన్నది కొన్ని సంఘాల ఉద్దేశం. దీంతో జేఏసీలో భాగస్వాములుగా ఉన్న అన్ని సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొనేలా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఆ సమావేశంలో పెండింగ్ డిమాండ్లతో పాటు అవసరమైతే కొన్ని కొత్తవాటిని కూడా చేర్చి చర్చించేలా ముసాయిదా ఎజెండా ఖరారైంది.
జేఏసీ (Employees JAC) చర్చించే కీలకమైన అంశాలు ఇవే..
• పీఆర్సీ నివేదికను ప్రభుత్వం వెంటనే తెప్పించుకుని అమలు చేయడం.
• ప్రస్తుతం అమలవుతున్న సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) అమలు చేయడం.
• ప్రస్తుతం నామమాత్రంగా అమలవుతున్న ఎంప్లాయీస్ సెల్త్ స్కీమ్‌ను ఇక నుంచి పకడ్బందీగా అమలు చేయడం.
• ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ‘వారానికి ఐదు పని దినాల’ విధానాన్ని అమలు చేయడం. దీనిపై ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి జేఏసీ మెమొరాండం సమర్పించింది.
Also Read : రాహుల్ జీ.. అక్రమ ఓట్లు తొలగిస్తే తప్పేంటి..? : బీజేపీ
Follow Us On : WhatsApp

