‘మురసు’ తుఫాన్ అలర్ట్: రంగంలోకి దిగిన మంత్రి తుమ్మల!

కలం, ఖమ్మం బ్యూరో : ‘మురసు’ తీవ్ర తుఫాన్ (Murasu Cyclone) ముంచుకొస్తున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి తుమ్మల.. వర్షపాతం, వరి పంటల పరిస్థితి, జలాశయాల్లో నీటి నిల్వలపై ఆరా తీసి, ఎలాంటి నష్టం జరగకుండా క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

​భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్ అంకిత్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు విధిగా హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని, టాంటాం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పాఠశాల భవనాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న 94 రహదారుల వద్ద బారికేడింగ్‌లు ఏర్పాటు చేయాలని, వాగులు పొంగే ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేయడంతో పాటు చేపల వేట, పర్యాటకం, మైనింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు.

​ప్రజల సహాయార్థం కొత్తగూడెం ఐడీఓసీ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలు 08744-241950, 9392919743 నంబర్లను సంప్రదించవచ్చని, ప్రతి తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>