కలం, వనపర్తి: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె వనపర్తి (Wanaparthy) జిల్లాలో 22వ రోజుకు చేరింది. మంగళవారం కలెక్టరేట్ పరిధిలో ఎన్హెచ్ఎం (NHM) జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు పోచమ్మ బోనాలతో నిరసన తెలిపారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పోచమ్మ తల్లికి సమర్పించారు.
ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు పరుశురాం మాట్లాడుతూ.. గత 20 ఏళ్లకు పైగా 78 కేడర్లలో విధులు నిర్వహిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులు ప్రజలకు నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నారని తెలిపారు. కరోనా, డెంగీ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని పేర్కొన్నారు. బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్, హైరిస్క్ ప్రసవాల నిర్వహణ తదితర ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు.
జేఏసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్లీవెన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్యసేవల అభివృద్ధికి ఎన్హెచ్ఎం ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతాన్ని 31 నుంచి 70 శాతానికి పెంచడంలో, మాతృ మరణాల రేటును 25 నుంచి 19 శాతానికి, శిశు మరణాల రేటును 15 నుంచి 5 శాతానికి తగ్గించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. 2.98 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించడం, టీబీ నిర్మూలనలో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో మూడో స్థానానికి చేర్చడం వంటి విజయాల్లోనూ ఉద్యోగుల సేవలు ఉన్నాయని వివరించారు.
డాక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 18 ఏళ్లలోపు పిల్లల వరకు గుండె సంబంధిత సమస్యలు, ప్లాస్టిక్ సర్జరీలు, గ్రహణమొర్రి, వంకరపాదం తదితర సమస్యలకు శస్త్రచికిత్సలు చేయించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల సేవలు కీలకమని పేర్కొన్నారు.
ఎన్హెచ్ఎం ప్రధాన డిమాండ్లు ఇవే..
ఎన్హెచ్ఎం పరిధిలోని అన్ని కేడర్ల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, క్యాడర్ ఫిక్సేషన్ చేపట్టి 100 శాతం గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 60ను తక్షణమే అమలు చేయడంతోపాటు ఏటా 5 శాతం ఇంక్రిమెంట్లు కల్పించాలని కోరారు. 8 శాతం లాయల్టీ బోనస్ అమలు చేసి పెండింగ్ బకాయిలు చెల్లించాలని, జీఓ నంబర్ 1195ను పునఃపరిశీలించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ హరీశ్, కమిటీ సలహాదారు వెంకటకృష్ణారెడ్డి, కోశాధికారి రాఘవేంద్ర, డాక్టర్ మైథిలి, జాయింట్ సెక్రటరీ అనసూయ, మహిళా ఉద్యోగుల వైస్ ప్రెసిడెంట్ సుమిత్ర, రాధిక, జయమ్మ, స్టాఫ్ నర్సులు చరిత, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

