గుడిహత్నూర్ మోడల్ స్కూల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో కలిసి భోజనం

కలం, గుడిహత్నూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. మంగళవారం గుడిహత్నూర్ (Gudihathinur) మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్(Model School) , జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, విద్యార్థుల హాజరు శాతం, మౌలిక వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధనా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు.

మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. అనంతరం వంటశాల, కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో సాగు చేస్తున్న వివిధ రకాల కూరగాయల మొక్కలను తిలకించారు. కిచెన్ గార్డెన్‌లో పండించిన తాజా కూరగాయలను విద్యార్థుల భోజనానికి వినియోగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటువంటి తోటల ద్వారా విద్యార్థులకు ప్రకృతి, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు.

అనంతరం పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలు, ప్రాజెక్టులను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన యోగా, మ్యూజిక్ రూమ్‌లను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మకత, శారీరక, మానసిక వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లా స్థాయి పీఎం శ్రీ పాఠశాలల మాక్ పార్లమెంట్ పోటీల్లో గుడిహత్నూర్ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలవడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, తహసీల్దార్ కవితారెడ్డి, ఏపీఎం సుజాత, సర్పంచ్ ఆడే శీల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>