కలం, నల్లగొండ: వరంగల్–నల్లగొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా ప్రముఖ విద్యావేత్త పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) ప్రకటించారు. అశోక్ సార్‌గా ప్రాచుర్యం పొందిన ఆయన్ను నల్లగొండలో జరిగిన సభలో కండువా కప్పిన తీన్మార్ మల్లన్న పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడమే కాకుండా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.
విశ్రాంత సైనిక అధికారి లెఫ్టినెంట్ కల్నల్ భిక్షపతితో సహా అనేకమంది పేర్లను బీసీ మేధావుల ఫోరం పరిశీలించాక ఏకగ్రీవంగా అశోక్ కుమార్ పేరును సిఫారసు చేసిందని, అందుకే ఆయనను బరిలోకి దించుతున్నామని మల్లన్న వెల్లడించారు. బీసీ రాజ్యాధికార పాదయాత్ర 40వ రోజు నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. క్లాక్ టవర్ సెంటర్లో మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహానికి తీన్మార్ మల్లన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇది విడాకుల సభ..
అనంతరం తీన్మార్ మల్లన్న బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైన బీసీల హక్కులను కాలరాస్తూ ఆర్థిక వనరులను దోచుకుంటున్న అగ్రవర్ణ పాలనకు స్వస్తి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఇది బీసీలు, రెడ్లకు మధ్య జరుగుతున్న‘విడాకుల సభ’ అని స్పష్టం చేశారు. ప్రజా క్షేత్రంలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా అశోక్ సార్ జవాబు చెప్పడంలో విఫలమైతే పోటీ నుంచి తప్పుకుంటామన్నారు. ఈ సవాల్‌ను స్వీకరించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు దమ్ముందా? అని సవాల్ విసిరారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మల్లన్న విరుచుకుపడ్డారు. 40 ఏళ్ల నుంచి కుండలు తయారు చేసి అమ్ముతున్న కుమ్మరి బ్రహ్మయ్య చేస్తున్న సేవ కోమటిరెడ్డి కంటే గొప్పదన్నారు. టికెట్ కావాలంటే రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఉన్నాయా.. అని అడుగుతున్నారని మండిపడ్డారు. దసరా పండుగ రోజే బీసీలు రూ.1,000 కోట్ల మద్యం తాగారని.. మేం ఒక్క ఆదివారం మటన్ తినడం మానేస్తే వచ్చే డబ్బులతో బీఆర్ఎస్ పార్టీనే కొనేస్తామని స్పష్టం చేశారు.
రేవంత్‌కు డిపాజిట్ దక్కదు..
నల్లగొండ నియోజకవర్గంలో 2.44 లక్షల ఓట్లలో రెడ్డి సామాజికవర్గం ఓట్లు కేవలం 17 వేలు మాత్రమేనని తీన్మార్ మల్లన్న తెలిపారు. 1.33 లక్షల ఓట్లు ఉన్న బీసీల మద్దతుతో గెలిచి బీసీలపైనే పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామని చెప్పి, అసెంబ్లీలో కేవలం రూ.2,400 కోట్లు మాత్రమే ఇచ్చామని ఒప్పుకున్నారని విమర్శించారు. బీసీ విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్మెంట్ బకాయిలు రూ.1,600 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు.
తమ పార్టీకి ‘కత్తెర’ గుర్తు కేటాయించారని, మంగలి, సాకలి, దర్జీల చేతుల్లో ఉండే ఈ కత్తెరతో దోపిడీదారుల తోకలు కత్తిరిస్తామన్నారు. బీసీలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి కొడంగల్‌లో కూడా డిపాజిట్ దక్కదని హెచ్చరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్, ఎంబీటీ ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్, ప్రొఫెసర్ మురళీ మనోహర్, సతీష్ కొట్టే, డాక్టర్ కల్నల్ భిక్షపతి, ఎర్ర సత్యనారాయణ పాల్గొన్నారు.

