కలం, వనపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, సాగునీరు, విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. కృష్ణా జలాలు పాలమూరు పొలాలకు చేరాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని ఆరోపించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్నల రణబేరి’ సభలో ఆయన మాట్లాడారు. సభకు ముందు సాగునీరు అందక ఎండిపోయిన వరి పంటలను హరీశ్‌రావు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. రైతులు కొండన్న 3.5 ఎకరాలు, ఆశన్న 6 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా, సాగునీటి సమస్యలను వివరించి పంట నష్టానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.
అనంతరం రైతన్నల రణబేరి సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవడం లేదని విమర్శించారు. మోటార్లను పూర్తిస్థాయిలో నడపకపోవడం, సాగునీరు అందించకపోవడంతో పాలమూరులో మళ్లీ కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీరు, విద్యుత్‌కు ప్రాధాన్యమిచ్చామని పేర్కొన్నారు. చెక్‌డ్యాంలు, పెండింగ్ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కరువు మండలాల ప్రకటనతో సరిపెట్టకుండా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రైతులను పట్టించుకోవడం లేదు: నిరంజన్ రెడ్డి
కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. నదిలో నీరున్నా రైతుల పొలాలకు చేరకపోవడం బాధాకరమన్నారు. గతంలో వనపర్తి జిల్లాను వరి సాగులో రాష్ట్రంలోనే ముందంజలో నిలిపామని, నేడు పంటలు ఎండిపోతుండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. యూరియా కోసం రైతులు ప్రతి సీజన్‌లో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. అదే విధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నందున వారికి తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు
సభ అనంతరం వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, వారి అనుచరులు బీఆర్ఎస్‌లో చేరారు. ఎదుల మాజీ సర్పంచ్ జిల్లెల శ్రీనివాస్‌రెడ్డి 200 మంది అనుచరులతో, దత్తాయపల్లి సర్పంచ్ దేవేందర్‌నాయుడు, మాజీ సర్పంచ్ రాజునాయక్ తన అనుచరులు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మ, ఆమె కుమారుడు రామాలయం వినోద్ గౌడ్, శివ గౌడ్ కూడా తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో, హరీశ్‌రావు సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, గద్వాల బీఆర్ఎస్ ఇన్‌చార్జి బాస్ హనుమంతునాయుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఇంతియాజ్, వాల్యానాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, రజినీ సాయిచంద్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు పలుస రమేష్ గౌడ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, ప్రేమనాథ్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

