చంద్రకళ మృతిపై విచారణ చేపట్టాలి: ఎండీ ఉమర్

కలం, కరీంనగర్: ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని చంద్రకళ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, ఆమె మృతికి గల కారణాలను వెలికితీయాలని తెలంగాణ రక్షణ సమితి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఉమర్ (MD Umar) డిమాండ్ చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, హాస్టల్‌లో ఉన్న భద్రతా ఏర్పాట్లు, సంబంధిత అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. విద్యార్థిని చంద్రకళ ఆత్మహత్య అత్యంత బాధాకరమైన సంఘటన అని అన్నారు. విద్యార్థుల భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించారా లేదా అనే అంశంపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వైస్‌ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేర్‌టేకర్, వార్డెన్లపై తక్షణమే చర్యలు తీసుకొని, విచారణ పూర్తయ్యే వరకు వారిని బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు అవసరమైన రక్షణ, భద్రత కల్పించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చంద్రకళ కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>