కలం, నల్లగొండ : దక్షిణ భారత చారిత్రక వైభవానికి, సామాజిక విశ్లేషణలకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ (Mahatma Gandhi University) వేదిక కానుందని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. నవంబర్ 13, 14, 15 తేదీలలో ఎంజీయూలో నిర్వహించనున్న 45వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ (South Indian History Congress) సదస్సుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ మూడు రోజుల జాతీయ స్థాయి సెమినార్ ద్వారా విద్యార్థులు, యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల్లో చారిత్రక పరిశోధనలపై జిజ్ఞాస పెరుగుతుందని విసి పేర్కొన్నారు.
అలాగే ప్రభుత్వ విభాగాలు, పాలసీ మేకర్లకు ఈ వేదిక విలువైన సమాచారాన్ని, జ్ఞానాన్ని అందిస్తుందన్నారు. దక్షిణ భారతదేశపు చారిత్రక ప్రాముఖ్యతను చాటడమే కాకుండా, నల్లగొండ జిల్లా పర్యాటక రంగానికి విస్తృత ప్రాచుర్యం కల్పించడంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ చరిత్రతో పాటు అణగారిన వర్గాల చరిత్రలు, హిస్టరియోగ్రఫీ, డిజిటల్ ప్రదర్శనలపై లోతైన విశ్లేషణలతో కూడిన పరిశోధనలను నిపుణులు ఈ వేదికపై సమర్పించనున్నట్లు తెలిపారు.
ఇంతటి ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి సదస్సును నిర్వహించే అవకాశం దక్కడం ఎంజీయూ(Mahatma Gandhi University)తో పాటు నల్లగొండ జిల్లాకే ఎంతో గర్వకారణమని విసి ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 45వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు పోస్టర్‌ను విసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణప్రియ, ఆచార్య విజయబాబులతో పాటు చరిత్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ పనస రామకృష్ణ, డాక్టర్ షరీఫ్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : అభిషేక్‌కు వన్డేల్లో ఛాన్స్ ఇవ్వాలి: యువరాజ్ సింగ్
Follow Us On : WhatsApp

