కలం, జగిత్యాల : జగిత్యాల (Jagtial Land Row) జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ వ్యవహారం కలకలం రేపుతోంది. జగిత్యాల పట్టణ శివారులోని సర్వే నంబర్ 1601లో ఉన్న ప్రభుత్వ భూమితో పాటు, దానికి ఆనుకొని ఉన్న పాత నిజామాబాద్ రోడ్డును కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ హస్తాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ డి. రాజవ్వ, జగిత్యాల మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ అల్లాల సరిత రమేష్ రావు, స్థానిక ప్రజలు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ వివాదాస్పద భూమి జగిత్యాల మున్సిపాలిటీకి, హస్తాబాద్ గ్రామానికి మధ్యలో జి.ఆర్. ఫంక్షన్ హాల్ ఎదురుగా జాతీయ రహదారి ఎన్‌హెచ్-63ను ఆనుకొని ఉందని, దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. గతంలో ఈ భూమి విషయంలో స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు స్వయంగా వచ్చి సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించారని తెలిపారు. ఇది ప్రభుత్వ రెవెన్యూ భూమి అని సూచిస్తూ అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారని సర్పంచ్, కౌన్సిలర్, గ్రామస్తులు పేర్కొన్నారు.
మళ్లీ తెరపైకి కబ్జా ఆరోపణలు
అయితే, గత నాలుగు నెలల క్రితం కొందరు వ్యక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హద్దురాళ్లను తొలగించి, జేసీబీలతో భూమిని చదును చేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా దశాబ్దాలుగా ప్రజలు ఉపయోగిస్తున్న పాత నిజామాబాద్ రోడ్డును కూడా మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మరోసారి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సర్వేయర్‌ను పంపిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఎవరూ రాలేదని, సర్వే నిర్వహించి మళ్లీ హద్దులు నిర్ణయించలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ప్రభుత్వ భూమితో పాటు ప్రజల రాకపోకలకు ఉపయోగపడే పాత రోడ్డును కాపాడాలని, వెంటనే రెవెన్యూ సర్వేయర్‌ను పంపించి తిరిగి హద్దులు నిర్ణయించాలని, ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని సర్పంచ్ రాజవ్వ, కౌన్సిలర్ అల్లాల సరిత రమేష్ రావు, స్థానిక ప్రజలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హస్తాబాద్ సర్పంచ్, కౌన్సిలర్‌తో పాటు మాజీ సర్పంచ్ కరుణాకర్ రావు, మహేష్, వంశీ, రవి, బత్తుల గంగాధర్, రాజేశం, దామోదర్ రావు, లక్ష్మణ్ రావు, గంగయ్య, వెంకటేష్, భగవంత రావు, మల్లారెడ్డి, రాం మోహన్ తదితరులు పాల్గొని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

