కలం, నిర్మల్ : సైబర్ మోసాల (Cyber Frauds) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) అన్నారు. సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆన్లైన్ లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ, పిన్, సీవీవీ నంబర్లు వెల్లడించవద్దని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఆన్లైన్ కొనుగోళ్లలో ప్రకటనలు, ఆఫర్ల నిజానిజాలను పరిశీలించుకోవాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, సైబర్ క్రైమ్ అధికారులు, ఎస్సైలు శ్రావణి, ముత్యం, తదితరులు పాల్గొన్నారు.

