కలం, వెబ్డెస్క్: ఉపాధి కోసం పరాయి దేశానికి వెళ్లిన ఆ యువకులు దారుణంగా మోసపోయారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రష్యా తీసుకెళ్లిన ఏజెంట్ నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు. ఏదో ఒక పని చేసుకొని డబ్బు సంపాదించుకుందాం అనుకున్న వారు ఆర్మీలో పనిలో చేరి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో (Russia – Ukraine War) చిక్కుకుపోయారు. విశాఖపట్నంలోని గాజువాకకు చెందిన జెట్టి వంశీతో పాటు మరో నలుగురు తెలుగు యువకులు ఏజెంట్ల మోసంతో రష్యా సైన్యంలో చిక్కుకున్నారు. ముందుగా వీరందరినీ ఆర్మీలో ఫుడ్ ప్యాకింగ్ ఉద్యోగమని చెప్పి తీసుకెళ్లారు. కానీ, అక్కడి నుంచి చివరికి వీరు రష్యా ఆర్మీలో చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిని బలవంతంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలోకి నెట్టడంతో తీవ్ర ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు.
ఈ యుద్ధం(Russia – Ukraine War)లో ఇప్పటికే ముగ్గురు గల్లంతైనట్లు వంశీ ఒక వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం తాను, సతీష్ మాత్రమే మిగిలామని తన చివరి వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వంశీ తల్లి తన కొడుకు పరిస్థితిపై కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భర్త లేని తనకు కొడుకే ఏకైక ఆసరా అని ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడిని రష్యా యుద్ధభూమి నుండి క్షేమంగా రక్షించి స్వదేశానికి రప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రాధేయపడుతున్నారు. రష్యా సైన్యంలో చిక్కుకున్న తమను కాపాడాలని కోరుతూ ఆ యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించి ఆ యువకులను త్వరగా సురక్షితంగా రక్షించాలని వారి కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read : ఢిల్లీలో దీపావళి వేడుకలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

