కలం, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థలో బీజేపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) వెంటనే స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ (Challa Harishankar) డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని కోరారు. బీజేపీ కార్పొరేటర్ల అవినీతి నిజమని తేలితే వారిని సస్పెండ్ చేస్తారా? లేక నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటలో ఉన్న ‘మీకోసం’ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.
బండి సంజయ్ వ్యాఖ్యలే అనుమానాలకు తావిస్తున్నాయి
గత ఎనిమిదిన్నర నెలలుగా నగరపాలక సంస్థలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోందని హరిశంకర్ (Challa Harishankar) పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో అవినీతికి పాల్పడితే కార్పొరేటర్లను “బ్లాక్‌లిస్టులో పెడతాను” అని బండి సంజయ్ వ్యాఖ్యానించడాన్ని ఆయన ప్రస్తావించారు. పాలకవర్గ సభ్యులు అవినీతికి పాల్పడకపోతే కేంద్ర మంత్రికి ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆయన మాటలే బీజేపీ నాయకుల అక్రమాలకు బలాన్ని చేకూరుస్తున్నాయని అన్నారు.
రూ.100 కోట్ల నిధులు ఏమయ్యాయి?
జనరల్ ఫండ్, యూఏడీఎఫ్ కింద దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నా, నగరంలో క్షేత్రస్థాయిలో ఎక్కడా అభివృద్ధి పనులు కనిపించడం లేదని ఆరోపించారు. కేవలం పనులకు శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టడానికే నాయకులు పరిమితమవుతున్నారని, పనులు మాత్రం ముందుకు సాగడం లేదని విమర్శించారు.
కమీషన్ల రాబందులు
భవన నిర్మాణ అనుమతులు లభించిన ప్రదేశాల్లో, పనులు జరిగే ప్రాంతాల్లో బీజేపీ కార్పొరేటర్లు గద్దల్లా వాలి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. పనుల కేటాయింపు, బిల్లుల చెల్లింపుల్లో కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నారని, కాంట్రాక్టర్లను నేరుగా విచారిస్తే వాస్తవాలు బయటపడతాయని తెలిపారు.
అమ్మవారి ఆలయంలో ప్రమాణానికి సిద్ధం.. సవాల్
నగరంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని హరిశంకర్ వెల్లడించారు. “మా వద్ద ఉన్న ఆధారాలతో మీడియా సమక్షంలో కరీంనగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బండి సంజయ్ ఈ సవాల్‌ను స్వీకరించే ధైర్యం ఉందా? మేము చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతా” అని చల్ల హరిశంకర్ సవాల్ విసిరారు.
తమ వద్ద ఉన్న ఆధారాలను పూర్తిగా బయటపెడితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆధారాలు బయటపెట్టకముందే శాఖాపరమైన, చట్టపరమైన విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అనూప్ కుమార్, డివిజన్ అధ్యక్షులు ఆరె రవి, చేతి చంద్రశేఖర్, తొంటి రాజేందర్, రాజ్ కుమార్, బండ శ్రీకాంత్, పిట్టల శ్రీనివాస్, యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, సీనియర్ నాయకులు కలర్ సత్తన్న, మిడిదొడ్డి నవీన్, సత్తినేని శ్రీనివాస్, నాగుల కిరణ్, సైఫ్, ఇర్ఫాన్, విజ్ఞాన్ శ్రీనివాస్, సాయి, ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఇంధన విప్లవం.. E-20 ఇథనాల్‌కు మొక్కజొన్న..!
Follow Us On: X(Twitter)

