కలం, హనుమకొండ : గ్రావెల్ (మట్టి) తవ్వకాలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ, అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు హనుమకొండ జిల్లాలో నూతన సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్మెంట్ సిస్టం (IGMS Portal) పోర్టల్‌ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు మొబైల్ నంబర్‌తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి గ్రావెల్ అనుమతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను పరిశీలించి మూడు నుంచి ఐదు రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. సొంత పట్టా భూమి నుంచి మట్టి తీసుకుంటే పట్టాదారు పాస్‌బుక్, ఇతరుల భూమి నుంచి తీసుకుంటే యజమాని సమ్మతి పత్రం అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల విషయంలో సర్వే నంబర్, జియో కోఆర్డినేట్స్ సమర్పించాలన్నారు.
నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలుంటే ఆ శాఖకు దరఖాస్తులు పంపిస్తామని, రెండు రోజుల్లో పరిశీలన పూర్తిచేసి రెవెన్యూ శాఖకు పంపిస్తారని వివరించారు. అవసరాన్ని బట్టి మైనింగ్ శాఖ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అనుమతులు జారీ చేస్తుందన్నారు.
క్యూఆర్ కోడ్‌తో రవాణాపై నిఘా
అనుమతి మంజూరైన వెంటనే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుందని, అందులో మట్టి పరిమాణం, తరలించే ప్రాంతం, గమ్యస్థానం, అనుమతి సమయం, వాహనాల నంబర్లు నమోదవుతాయని కలెక్టర్ తెలిపారు. అనుమతించిన వాహనాల ద్వారానే మట్టి తరలించాలని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది అనుమతించిన, వాస్తవంగా తరలించిన ట్రిప్పుల సంఖ్యను పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. ఈ విధానం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం గ్రామ పంచాయతీలకు కేటాయిస్తామని వెల్లడించారు.
ఇసుకకు వర్తించదు
ఈ పోర్టల్ కేవలం గ్రావెల్ (మట్టి) అనుమతుల కోసమేనని, ఇసుకకు వర్తించదని కలెక్టర్ స్పష్టం చేశారు. చిన్నచిన్న రోడ్ల నిర్మాణాలు, ఇతర స్థానిక పనులకు అవసరమైన తక్కువ పరిమాణంలో గ్రావెల్ పొందేందుకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. పోర్టల్ వినియోగంపై రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఇన్చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్వో శ్రీనివాస్, మైనింగ్ ఏడీ రామాచారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

