కలం, మంథని: రాజకీయ కక్షతో దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇలాంటి ఘటనలను సహించేది లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట (Former MLA Putt Madhukar) మధూకర్ హెచ్చరించారు. మంథని (Manthani) పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అభిమాని నల్లవెల్లి సదయ్య (అక్కెపల్లి సది) ఇంటిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలు దాడి చేసిన ఘటన బుధవారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంథని పట్టణంలోని ఏఎల్ఆర్ ఏసీ ఫంక్షన్ హాల్ సమీపంలో నివాసం ఉంటున్న సదయ్య ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించి బండరాళ్లతో అద్దాలు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వివరాలను బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

