కలం, వెబ్ డెస్క్ : అత్యవసర సమయంలో మానవత్వంతో స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది (108 Ambulance Staff) ఓగర్భిణీ స్త్రీని (Pregnant Woman) సురక్షితంగా ఆసుపత్రికి చేర్చి తమ సేవా నిరతిని చాటుకున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన మారుమూల గిరిజన గ్రామాల్లో రవాణా సౌకర్యాల కొరతను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఆసిఫాబాద్ మండలంలోని చిలకగూడ గ్రామానికి చెందిన ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
స్పందించిన అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో దస్నాపూర్ వాగు ప్రవాహం అడ్డంకిగా మారింది. దీంతో కెరమెరి, రెబ్బెన ప్రాంతాల నుంచి వచ్చిన 108 అంబులెన్సులు వాగు వద్దకు చేరుకున్నాయి. గర్భిణిని ఎలాగైనా ఆసుపత్రికి చేర్చాలనే ఉద్దేశంతో ఈఎంటీలు రమణ, ప్రఫుల్ సాహసోపేతంగా వ్యవహరించారు. వాగును దాటించి, అక్కడి నుంచి బైక్‌పై గర్భిణిని అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవల కోసం చేర్పించారు.
ఈ ఘటన మారుమూల గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న రహదారి, రవాణా సమస్యలను మరోసారి గుర్తుచేసింది. సరైన రహదారులు, వంతెనలు లేక అత్యవసర పరిస్థితుల్లోనూ వాగులు దాటాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మారుమూల గ్రామాలకు మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

