రాప్తాడు నిందితుడి హెల్త్ బులిటెన్ విడుదల!

కలం, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా రాప్తాడు (Raptadu Incident) జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో అత్యంత దారుణంగా దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌కు జీజీహెచ్‌ వైద్యులు రాత్రి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడి కాళ్లలో ఉన్న బుల్లెట్లను అనంతపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులు సర్జరీ చేసి తొలగించారు.

ఈ మేరకు నిందితుడు హేమంత్ కుడి కాలికి నాలుగు, ఎడమ కాలికి రెండు బుల్లెట్లు తగిలినట్లు శస్త్రచికిత్స అనంతరం వైద్యులు వెల్లడించారు. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో అతడికి నాలుగు ప్యాకెట్ల రక్తం ఎక్కించినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడికి ఆక్సిజన్ అందిస్తున్నామని, శరీరంలో తీవ్ర గాయాలు ఉన్నందున పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే అతడి కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడంతో అవసరమైతే కాళ్లు తొలగించాల్సి వస్తుందా అనే కోణంలో సోమవారం నిర్వహించే స్కానింగ్ పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి వైద్య నిర్ణయాలు తీసుకుంటామని జీజీహెచ్‌ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు.

అంతకుముందు ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం 25 ప్రత్యేక బృందాలతో అన్వేషణ మొదలుపెట్టారు. ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో హేమంత్ దాక్కున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసులు అతడిని లొంగిపోవాలని సూచించగా, నిందితుడు రాళ్లతో , కత్తితో రాప్తాడు సీఐపై దాడికి దిగాడు. ఈ దాడిలో సీఐ గాయపడటంతో, ఇతర సిబ్బంది ఆత్మరక్షణ కోసం నిందితుడు పారిపోకుండా ఉండేందుకు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారని జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు.

కాగా, పాఠశాల తరగతి గదిలోనే ఎలక్ట్రిక్ రంపంతో జరిగిన ఈ అమానుష ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన తోటి విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన బాధిత విద్యార్థిని ప్రస్తుతం బెంగళూరులోని ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్స పొందుతోంది. నిందితుడు దొరకడం, అతడిపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అదుపులోకి తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>