గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లపై కాంగ్రెస్ కసరత్తు.. వారికే ఛాన్స్?

కలం, తెలంగాణ బ్యూరో: ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం ముగియడంతో పదవుల భర్తీపై స్టేట్ కాంగ్రెస్ ఫోకస్ పెట్టనుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ (Telangana MLCs), నామినేటెడ్ పోస్టుల భర్తీ, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టిసారించనుంది. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, గోరటి వెంకన్న పదవీ కాలం ఈ నెలలోనే ముగియనున్నది. దీంతో ఈ మూడు సీట్లలో కొత్త వారిని నియమించడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.

ఈ పదవుల కోసం ఆశావహుల జాబితా భారీగా ఉండగా, సామాజిక న్యాయం పాటించాలని పార్టీ భావిస్తున్నది. ఇప్పటికే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించింది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానంలో రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి స్థానంలో సామ రామ్మెహన్ రెడ్డిని బరిలోకి దించింది. ఈ రెండు సీట్లనూ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించడంతో.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లలో రెండు బీసీలకు, ఒకటి ఎస్సీలకు కేటాయిస్తారని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. మరోవైపు గవర్నర్ కోటాలో తమకూ అవకాశం ఇవ్వాలని బ్రాహ్మణ సామాజిక వర్గ నేతలు హైకమాండ్‌ను అడుగుతున్నట్టు తెలిసింది.

పద్మశాలి వర్గం నుంచి ముగ్గురు

బీసీలకు రెండు సీట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుండగా, అందులో ఒకటి పద్మశాలి సామాజిక వర్గానికి దక్కే అవకాశం ఉన్నది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖది అదే సామాజిక వర్గం కావడంతో.. ఆ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె పవిత్రవాణి పేరు ఈ సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్నది. ప్రస్తుతం ఆమె వైద్యవృత్తిలో ఉన్నారు.

మరోవైపు పద్మశాలి సామాజిక వర్గం నుంచి నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్ నేత పేరు కూడా వినిపిస్తున్నది. నల్లగొండ జిల్లాలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం, మునుగోడు నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం.. ఆయనకు కలిసి వచ్చే అంశాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, పార్టీ సీనియర్ నేత సంగిశెట్టి జగదీశ్వర రావు, సంగీతం శ్రీనివాస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఒక్క సీటు.. మూడు వర్గాలు

బీసీల్లో ఒక సీటు పద్మశాలి వర్గానికి ఇచ్చే అవకాశం ఉండగా.. మరో సీటు కోసం ముదిరాజ్, యాదవ, మున్నూరుకాపు సామాజిక వర్గాలు పోటీ పడుతున్నాయి. మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి మున్నూరుకాపు సామాజిక వర్గం కావడం, ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో మున్నూరు కాపు కోటాలో ఆయనకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది.

ఇటీవల పండుగ సాయన్న జయంతి కార్యక్రమంలో ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సామాజిక వర్గం నుంచి నీలం మధు ముదిరాజ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఈయనతో పాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేసిన సునీతారావు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తున్నది.

ఇక యాదవ సామాజిక వర్గం నుంచి కూడా కొంతమంది నేతలు పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నుంచి బీసీలకు ప్రాతినిధ్యం లేనందున తనకు అవకాశం ఇవ్వాలని ఆ జిల్లాకు చెందిన లోకేశ్ యాదవ్ అడుగుతున్నట్లుగా తెలిసింది. చరణ్ కౌశిక్ యాదవ్, లింగం యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొంత మంది నేతలు కూడా సీటు ఆశిస్తున్నారు. తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని బస్వరాజ్ సారయ్య అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం.

ఎస్సీల నుంచి ఎక్కువే..

రెండు బీసీలకు ఇస్తే, మిగిలిన ఒక సీటు ఎస్సీకి దక్కుతుందని పార్టీలో ప్రచారం జరుగుతున్నది. ఎస్సీ నుంచి మాదిగ సామాజిక వర్గానికి ఇస్తారని తెలుస్తున్నది. దీనికోసం చాలామంది పోటీలో ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, విద్యా కమిషన్ సభ్యుడిగా పని చేసిన చార్కొండ వెంకటేశ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత దొమ్మాట సాంబయ్య, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రీతమ్ కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

త్వరలోనే కేబినెట్ నిర్ణయం

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై హైకమాండ్‌తో చర్చించి, ముగ్గురి పేర్లను ఖరారు చేస్తారని తెలుస్తున్నది. వాళ్ల పేర్లను ఈ వారంలోనే ప్రకటిస్తారనే చర్చ జరుగుతున్నది. అనంతరం రాష్ట్ర కేబినెట్ ఓకే చేసి, గవర్నర్‌‌కు ఫైల్‌ పంపనుంది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం వివాదస్పదమైంది. ఆనాడు బీఆర్ఎస్ మంత్రివర్గం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నియామకానికి అప్పటి గవర్నర్ తమిళిసై నో చెప్పారు. ఈ అంశం సుప్రీంకోర్టుకు వరకు చేరింది. దీంతో ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎలాంటి వివాదాలు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>