‎తెలంగాణలో బీసీల రాజ్యాధికారమే లక్ష్యం: తీన్మార్ మల్లన్న

‎కలం, నల్లగొండ: ‘ఎవరి నియోజకవర్గం ఇది? వెంకట్‌రెడ్డిదా? ఏంది లైట్ బంద్ చేస్తావా? తిక్కల మనిషివి ఉన్నావు నువ్వు! రేపు నీ లైట్లు కూడా బంద్ చేస్తా ఆగు. బీసీల దమ్ము ఏందో చూపిస్తా. నీ దుకాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రేపు నల్లగొండ వచ్చి మాట్లాడుతా. రేపు సాయంత్రం 7 గంటలకు నల్లగొండ క్లాక్ టవర్ వద్ద తీన్మార్ మల్లన్న ఉంటాడు.. దమ్ముంటే చూసుకుందాం! తేల్చుకుందాం!” అని టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) హెచ్చరించారు. అంతకుముందు తీన్మార్ మల్లన్న ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నేరుగా సవాల్ విసిరారు. వెనకబడిన తరగతుల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర’ 39వ రోజు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి చేరుకుంది.

ఈ సందర్భంగా తిప్పర్తి చేరుకున్న మల్లన్నకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ కార్నర్ మీటింగ్ లో ఆయన ఉద్రేకపూరిత ప్రసంగం చేస్తూ అగ్రవర్ణ రాజకీయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ నిధుల పంపిణీలో జరుగుతున్న తీవ్ర అసమానతలను మల్లన్న ఒక ఉదాహరణతో వివరించారు. “ట్యాంకు దగ్గర నల్లా ఇప్పినప్పుడు ఊరిలో అందరి ఇండ్లకూ సమానంగా నీళ్లు పోవాలి. కానీ మన బీసీల ఇండ్లకేమో సన్నటి దార వస్తోంది.. అగ్రవర్ణాల ఇండ్లకేమో దొడ్డు దార పోతోంది” అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలసి వ్యవసాయ రంగానికి కరెంట్, ఎరువులు, సబ్సిడీలు, బోనస్, రైతుబంధు, రైతుభరోసా కింద ఇప్పటివరకు రూ. 2,65,000 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. నూటికి 60 మంది ఉన్న బీసీలకు 60 శాతం నిధులు రావాల్సి ఉంటే, కనీసం ఆరు రూపాయలు కూడా రావడం లేదని మండిపడ్డారు.

నల్గొండ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం ఉన్న 2,44,545 ఓట్లలో రెడ్ల ఓట్లు కేవలం 17,000 మాత్రమేనని, బీసీల ఓట్లు 1,33,411 ఉన్నాయని మల్లన్న స్పష్టం చేశారు. 1952 నుంచి నల్గొండలో గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రస్తావిస్తూ, అగ్రవర్ణ నేతలు నల్లగొండను గుత్త పట్టి దోపిడీ చేశారని ఆరోపించారు. “ఇన్ని రోజులు మీ పాలన చూశాం, ఇక మీ సేవలు చాలు.. మేం ప్రజాసేవ చేసుకుంటాం. వచ్చే ఎన్నికల్లో నల్గొండలో బీసీ అభ్యర్థినే గెలిపించుకుంటాం” అని ధీమా వ్యక్తం చేశారు. “మాకు రెడ్ల ఓట్లే వద్దే వద్దు. తెలంగాణలో మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లే మాకు చాలు. దమ్ముంటే బీసీల ఓట్లు మాకొద్దని రెడ్లు, వెలమలు చెప్పాలి. నేటితో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, రెడ్లకు విడాకులు ఇస్తున్నాం!” అని ప్రకటిస్తూ, 2028 ఎన్నికల్లో రెడ్డి రాజ్యాన్ని పాతరేసి బీసీ రాజ్యాధికారాన్ని ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లేదా ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులనైనా బెదిరిస్తే “పండబెట్టి తొక్కుతాం” అని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి ‘కత్తెర’ గుర్తుపై తమ అభ్యర్థిని బరిలోకి దింపుతున్నామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ కత్తెర గుర్తుకే ఓటు వేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>