కలం, స్పోర్ట్స్: భారత షట్లర్ పీవీ సింధు (PV Sindhu) మరోసారి పతకాల బాటపట్టారు. హైలో ఓపెన్‌లో గ్రాండ్ విక్టరీ సాధించారు. ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో డెన్మార్క్‌కు చెందిన లైన్ క్లాస్ఫెల్ట్ను ఓడించి, ఈ సీజన్లో తన రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. టైటిల్ ఫైట్‌లో సింధు మొదటి నుంచి దూకుడుగా ఆడింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి కొంత పోటీ ఎదురైనా, బ్రేక్ సమయానికి సింధు ఆధిక్యం సాధించింది. తనదైన పర్ఫార్మెన్స్తో మొదటి గేమ్‌ను 21-12తో కైవసం చేసుకుంది.
రెండో గేమ్‌లో డెన్మార్క్ ప్లేయర్ పుంజుకునే ప్రయత్నం చేసినా.. సింధు కంట్రోల్ తప్పలేదు. ప్రత్యర్థి తప్పులను అనుకూలంగా మార్చుకుంటూ 21-14తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను ముగించింది. టోర్నీ మొత్తంలో సింధు ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. గత వారం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ అన్ సె యంగ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన సింధు.. ఈసారి మాత్రం ఆ తప్పు జరగనివ్వలేదు. గత జూలైలో గెలిచిన జపాన్ ఓపెన్ తర్వాత ఈ ఏడాది బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో సింధుకు ఇది రెండో టైటిల్ కావడం విశేషం.

