ప్రాణం పోయినా అవినీతి చేయను: రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

‎కలం, మునుగోడు: సమాజంలో మంచి చేసేవారిపై అసూయ, శత్రుత్వం పెరిగిపోతున్నాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా సామాన్య కార్యకర్తలానే ఉంటూ ప్రజల మధ్య మెలుగుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం, గట్టుప్పల్ మండల కేంద్రంలో కురుమ సంఘానికి చెందిన ‘శ్రీ బీరప్ప గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం’ నూతన భవనాన్ని గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా నూతన భవన ప్రాంగణంలో ఆయన మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వయస్సు పైబడిన వారికి సమాజంలో తగిన అండదండలు ఉండాలని, అందుకోసమే కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కురుమ సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పుల వల్లే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, దాని పర్యవసానాలను నేటి ప్రభుత్వం ఎదుర్కొంటోందని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీలో ఉంటూ కూడా పోరాడాల్సి వస్తోందన్నారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉండి డిండి ప్రాజెక్టు నుంచి లేదా శివన్నగూడెంకు నీళ్లు ఎలా తేవాలో కూడా ఆలోచన చేయని నాయకులు, ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గట్టుప్పల్‌ను మండలంగా, చండూరును రెవెన్యూ డివిజన్‌గా చేసింది తన రాజీనామానేనని గుర్తుచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో చర్చించి ప్రాజెక్టుల నీటి సాధనకు చర్యలు వేగవంతం చేశామని వెల్లడించారు. గ్రామాల్లో మద్యం సంస్కృతి పెరిగి కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయని, కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారమే మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలిస్తున్నామని తెలిపారు. “నేను రాజకీయాల్లో ఉన్నంతవరకు ప్రాణం పోయినా అవినీతి చేయను, చేయనివ్వను” అని తేల్చిచెప్పారు. వ్యవస్థలో మూలమూలలా పేరుకుపోయిన అవినీతి అంతమొందితేనే పేదలకు పూర్తి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో గట్టుప్పల్ మండలాన్ని అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కురుమ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>