కలం, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ (RSS) సంఘం శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం పథ సంచలన్ (Path Sanchalan) నిర్వహించారు. నారాయణపేట, దామరగిద్ద, ఉట్కూరు ఖండల నుండి స్వయం సేవకులు పథ సంచలన్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పురవీధుల గుండా పథ సంచలన్ కొనసాగింది. మినీ స్టేడియం మైదానంలో జరిగిన సభలో విభాక్ ప్రచారక్ దేవేందర్ జీ మాట్లాడారు. హిందువుల సంఘటితం కోసం ఆర్ ఎస్ ఎస్ ను డాక్టర్ జీ చిన్నతనంలో ప్రారంభించారన్నారు. వర్ణం, కులం పేరుతో విడిపోయిన భారతదేశం సంఘటితం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కృషి చేస్తుందన్నారు. అనేక సంవత్సరాలు విదేశీయుల చేతిలో మన దేశం పాలించబడిందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు అందించాలన్నారు. దేశంపై జరుగుతున్న విదేశీ కుట్రలను భారత దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. ఎంతో మంది మహానుభావులు దేశంలోనీ సాధారణ ప్రజల్లో సనాతన ధర్మం పట్ల నిష్టను కల్పించి దేశానికి స్వాతంత్రం వచ్చేలా పోరాడారన్నారు.
దేశంలోని 2 లక్షల 50వేల గ్రామాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖలు ఉన్నాయన్నారు. ప్రపంచంలో సనాతన ధర్మమున్న దేశం భారత దేశం తప్ప మరొకటి లేదన్నారు. చిన్న వయసులోనే దేశభక్తి కలిగిన డాక్టర్ జి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. వందేమాతరం పాడొద్దని బ్రిటిష్ ప్రభుత్వం సర్కులర్ జారీ చేస్తే భారతీయుల మనోభావాలకు అనుగుణంగా స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు త్యాగమూర్తులు ఆత్మబలిదానం చేసి పోరాడి దేశానికి స్వాతంత్రాన్ని అందించారన్నారు. సంఘ విద్రోహశక్తుల పట్ల వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కుటుంబ విలువలు కలిగిన గొప్ప దేశం భారతదేశమన్నారు. భారతదేశం ప్రపంచ దేశాలకు విశ్వ గురువు కావాలన్నదే లక్ష్యమన్నారు. పథ సంచలనలో భాగంగా స్వయం సేవకులకు అడుగడుగునా ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నారాయణపేట సంఘచాలక్ డాక్టర్. మదన్మోహన్ రెడ్డి, ఊట్కూరు సంఘచాలక్ నీలి రాంరెడ్డి తో పాటు స్వయం సేవకులు పాల్గొన్నారు.

