20వ రోజుకు చేరిన ఎన్‌హెచ్ఎం ఉద్యోగుల‌ సమ్మె

కలం, నాగర్‌కర్నూల్‌: ఒకప్పుడు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకున్న ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించారు. కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తించారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో కీలకపాత్ర పోషించారు. అలాంటి చేతులే నేడు తమ కుటుంబాల భవిష్యత్తు కోసం రోడ్డెక్కాయి. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కార్లు శుభ్రం చేస్తూ నిరసన తెలిపాయి. నాగర్‌కర్నూల్‌లో ఆదివారం జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు (NHM Employees) చేపట్టిన ఈ వినూత్న ఆందోళన వారి ఆవేదనకు అద్దం పట్టింది.ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాగర్‌కర్నూల్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారానికి 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు కార్లను శుభ్రం చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇరవై రోజులుగా వివిధ రూపాల్లో శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కోవిడ్‌ సేవలకు గుర్తింపు ఏదీ?

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ప్రజారోగ్య వ్యవస్థలో విడదీయలేని భాగమని పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రపంచమంతా భయాందోళనలకు గురైన వేళ, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలందించి ప్రభుత్వానికి అండగా నిలిచారని గుర్తుచేశారు.ప్రభుత్వ పెద్దలు మానవీయ కోణంలో ఆలోచించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

78 కేడర్ల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

ఎన్‌హెచ్‌ఎం పరిధిలోని 78 కేడర్ల ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌ రెగ్యులరైజేషన్‌ (ఉద్యోగాల క్రమబద్ధీకరణ) అని నాయకులు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సేవలను గుర్తించి వారిని క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించడంతోపాటు ఇతర న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు. కోవిడ్‌ సమయంలో తమ కుటుంబాలను సైతం పక్కనపెట్టి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు విధులు నిర్వర్తించామని, ప్రభుత్వ పిలుపునకు స్పందిస్తూ ప్రతి ఆరోగ్య కార్యక్రమంలోనూ బాధ్యతగా పనిచేశామని తెలిపారు. తాము కోరుతున్నది అదనపు ప్రయోజనాలు కాదని, ఎన్నో ఏళ్లుగా అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు, జీవితాలకు ఉద్యోగ భద్రత మాత్రమేనని పేర్కొన్నారు. తమ పోరాటాన్ని కేవలం సమ్మెగా కాకుండా ఎన్నో కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడిన సమస్యగా పరిగణించాలని కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సేవలందించిన ఉద్యోగుల జీవితాలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించి, మానవతా దృక్పథంతో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డాక్టర్‌ బాలకృష్ణ, దామగట్ల కుమార్‌ ప్రభుత్వ పెద్దలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్‌ పాషా, హైమవతి, శ్రీనివాసులు, డాక్టర్‌ సంధ్య, డాక్టర్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>