కలం, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేసిందని విమర్శించారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని ఖోడద్ గ్రామంలో ఏముల శివారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు నిర్మించిన బస్ షెల్టర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం తలమడుగు మండలంలో ఇటీవల చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించారు. మృతిచెందిన రైతుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి గులాబీ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు కుటుంబాలకు పార్టీ తరుపున ఆర్థిక సాయం అందించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన రైతు భీమా పథకాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గతంలో ఏ కారణం చేత రైతు మరణించినా రూ. 5 లక్షలు అందేలా ‘రైతు బీమా’ పథకాన్ని తాము అమలు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. అందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు తలమడుగులో బాధిత నలుగురు రైతన్నల కుటుంబాలకు అండగా నిలిచేందుకు వచ్చినట్లు తెలిపారు. వారికి పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కులను అందించామని తెలిపారు.

