చర్లగూడెం రిజర్వాయర్ పనులు వెంటనే పూర్తి చేయాలి: మాజీ ఎమ్మెల్యే

కలం, మునుగోడు : చర్లగూడెం రిజర్వాయర్ (Charlagudem Reservoir) నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, రాచకొండ సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లోని 44,567 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో రాచకొండ సాగునీటి పథకాల సాధన కోసం నిర్వహిస్తున్న మూడు రోజుల మహా పాదయాత్రను మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు వద్ద జూలకంటి రంగారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. చర్లగూడెం రిజర్వాయర్ పనులు సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ పూర్తికాకపోవడంతో రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని కోరారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రజలు సుమారు 80 సంవత్సరాలుగా ఫ్లోరైడ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కలుషిత నీరు తాగడం వల్ల ఎంతోమంది అనారోగ్య సమస్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి తీవ్రమైన సమస్య ఉన్నప్పటికీ పాలక ప్రభుత్వాలు ఈ ప్రాంతానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాయని విమర్శించారు. సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.

రాచకొండ ఎత్తిపోతల పథకం అమలైతే ఈ ప్రాంతంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ మహా పాదయాత్ర కొనసాగుతుందని, చివరి రోజైన నవంబర్ 3న చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, యాద్రాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లా సిపిఎం నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, దోనూరు నర్సిరెడ్డి,బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సురకంటి శ్రీనివాస్ రెడ్డి, దొంత గోని పెద్దులు,చాపల మారయ్య, దోడ యాదగిరి రెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, శ్రీనివాసచారి, ఏర్పుల యాదయ్య, నాంపల్లి చంద్రమౌళి, సాగర్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>