కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల (AP Municipal Elections) పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 99,36,014 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇప్పటికే 118 కార్పొరేటర్లు, 756 కౌన్సిలర్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మిగిలిన 92 చోట్లలో ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం 11,705 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. మున్సిపల్ ఎన్నికల విధులకు మొత్తం 36,351 మంది పోలీసులతో భారీ భద్రతను మోహరించారు. సుమారు 4,372 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయగా, ఇందులో 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అలాగే 1,233 సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతరం పోలీస్ నిఘా కొనసాగుతోంది. ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 1,543 రూట్ మొబైల్ బృందాలను రంగంలోకి దించారు. అదేవిధంగా 111 స్ట్రాంగ్ రూమ్ల వద్ద 4,655 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత కల్పించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 2వ తేదీన అవసరమైన చోట్ల రీపోలింగ్ నిర్వహించనుండగా, ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

