కలం, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా (Kagiso Rabada) చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో 350 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో కేప్‌టౌన్ టెస్టు ఐదో రోజు ఈ ఘనత సాధించాడు. బంతుల పరంగా తన సహచరుడు డేల్ స్టెయిన్ రికార్డును అధిగమించాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడంతో రబాడా ఖాతాలో 350వ వికెట్ చేరింది. 13,808 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
గతంలో డేల్ స్టెయిన్ 14,719 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. వకార్ యూనిస్ 14,905 బంతులతో మూడో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో 350 వికెట్లు తీసేందుకు రబాడాకు 75 మ్యాచ్‌లు పట్టింది. ఫాస్ట్ బౌలర్లలో ఈ ఘనతను అత్యంత తక్కువ టెస్టుల్లో అందుకున్న ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. మాల్కమ్ మార్షల్‌తో కలిసి ఈ స్థానాన్ని పంచుకున్నాడు. రిచర్డ్ హ్యాడ్లీ, డేల్ స్టెయిన్ 69 టెస్టుల్లోనే 350 వికెట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్నారు.
ఇక ఐదో రోజు ఆటలో రబాడా (Kagiso Rabada) బంతితో చెలరేగాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత మాట్ రెన్షాను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాతి బంతుల్లోనే మార్నస్ లబుషేన్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. లబుషేన్ రివ్యూ తీసుకున్నా ఫలితం మారలేదు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్ కూడా రబాడా ఖాతాలో చేరింది. దీంతో 350 టెస్టు వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బంతుల పరంగా ప్రపంచ రికార్డు సృష్టించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

