కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో పలు రెస్టారెంట్లలో టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో 22 బృందాలు మొత్తం 22 హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాలను తనిఖీ చేశాయి. ఈ తనిఖీల్లో పలు చోట్ల అపరిశుభ్రమైన వంటగదులు, గోడలపై మురికి, నీరు నిల్వ ఉండటం, చిమ్నీల్లో పేరుకుపోయిన కొవ్వు, బొద్దింకలు, ఈగల బెడద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన ఆహార పదార్థాలు, డేట్ అయిపోయిన వస్తువులు, ఫ్రిజ్‌లలో పచ్చి మాంసం, శాకాహార, మాంసాహార పదార్థాలను కలిపి నిల్వ చేయడం, వండిన ఆహారాన్ని సరైన లేబుల్స్ లేకుండా భద్రపరచడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. కొందరు సిబ్బంది హెయిర్‌నెట్స్, గ్లౌజులు ధరించకుండా ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ ఉల్లంఘనల నేపథ్యంలో అధికారులు 21 ఆహార నమూనాలను సేకరించారు. 544 కిలోల పాడైన కూరగాయలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు, గడువు ముగిసిన వస్తువులు, పురుగులు పట్టిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. పదేపదే వినియోగించినట్లు అనుమానించిన 13 కిలోల వంట నూనెను కూడా పారబోశారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 8 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 14 సంస్థల లైసెన్స్ రద్దు చేసినట్లు తెలిపింది. తనిఖీలు నిర్వహించిన సంస్థల్లో తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, పిస్తా హౌస్, షాహ్ ఘౌస్ కేఫ్, హోటల్ నయాబ్, లక్కీ రెస్టారెంట్, ఇంపీరియల్ మల్టీక్యూజిన్, మెహిఫిల్ రెస్టారెంట్, పిస్తా హౌజ్, తదితర ప్రముఖ హోటళ్లు ఉన్నాయి.
Also Read : డెమోక్రటిక్ సంఘాకు రెజీనా బిగ్ షాక్!
Follow Us On: X(Twitter)

