కలం, స్పోర్ట్స్ : సుదీర్ఘ విరామం తర్వాత డబ్ల్యూటీఏ టూర్ సెమీఫైనల్‌కు చేరుకుని టైటిల్ ముంగిట నిలిచిన అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ (Venus Williams) కు గ్వాంగ్ జౌ ఓపెన్‌లో తీవ్ర నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన హోరాహోరీ డబుల్స్ సెమీస్ పోరులో ప్రత్యర్థుల దాటికి తలవంచక తప్పలేదు. దీంతో ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఫైనల్‌కు చేరాలన్న ఆమె ఆశలు అడియాసలయ్యాయి.
ఇండోనేషియా భాగస్వామి జానిస్ జెన్‌తో కలసి బరిలోకి దిగిన వీనస్, రష్యా జోడీ పొలీనా కుడెర్మెటోవా-మరియా తిమోఫీవాలకు గట్టి పోటీనిచ్చారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన మ్యాచ్‌లో పరాజయం చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించారు. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనూ వీనస్ (Venus Williams) ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వరుస పరాజయాలు పలకరిస్తున్నప్పటికీ పోరాట పటిమ వీడని వీనస్ విలియమ్స్, వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వచ్చే వారం ప్రారంభమయ్యే హాంగ్‌కాంగ్ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

