కలం, నకిరేకల్: విద్యుత్ కోతలు, నీటి సరఫరా లేక కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) తెలిపారు. కేతేపల్లి మండలం బండపాలెం గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను శనివారం పరిశీలించారు. ఎన్నికల ముందు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి వచ్చాక రైతులకు కేవలం ఆరు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారని వివరించారు.
నీరున్నా పొలాలకు పారించుకోలేక..
విద్యుత్ కోతల కారణంగా బావుల్లో, బోరుబావుల్లో నీరున్నా పొలాలకు పారించుకోలేక పంటలు ఎండిపోతున్నాయని చిరుమర్తి లింగయ్య చెప్పారు. ఎన్నో ఆశలతో అప్పులు చేసి పంటలు సాగు చేస్తుంటే, ప్రభుత్వ విధానాలు వారి కష్టాలను మరింత రెట్టింపు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అడగకుండానే అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

