ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు డిసెంబర్ 10 వరకు అవకాశం

కలం, ఖమ్మం బ్యూరో: వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు (Graduate MLC Voter Registration) నవంబర్ 6 చివరి తేదీ కాదని, ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉందని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.

​ఈ సందర్భంగా నవంబర్ 6 తర్వాత కూడా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల రూపంలో దరఖాస్తులు సమర్పించవచ్చని అదనపు సీఈఓ తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు నిబంధనల ప్రకారం ఫారం-18 దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. ​

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖమ్మం జిల్లాలో 1.5 లక్షలకు పైగా పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 73,898 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా ఆ తేదీన ఫలితాలు వెలువడిన వారు ఓటరు నమోదుకు అర్హులని, ఒరిజినల్ సర్టిఫికెట్ లేనియెడల విద్యాసంస్థ అధిపతి ధృవీకరణ పత్రాన్ని కూడా పరిశీలనకు స్వీకరించవచ్చని స్పష్టం చేశారు.

​బీఎల్ఓలు దరఖాస్తుదారుల విద్యార్హతతో పాటు క్షేత్రస్థాయిలో నివాస స్థితిని కచ్చితంగా పరిశీలించాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఒకే ఐడీ ద్వారా వందల సంఖ్యలో ఆన్‌లైన్ దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించి వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే ఆమోదించాలని సూచించారు. నవంబర్ 25న ఓటరు జాబితా ముసాయిదా ప్రచురణ ఉంటుందని, డిసెంబర్ 30 నాటికి తుది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>